ఇంటింటికీ భరోసా : ముఖ్యమంత్రి చంద్రబాబు
అర్హులందరికీ ఇళ్లు సమకూరుస్తాం
ఆకలి బాధను దూరం చేస్తాం
దేశంలోనే తొలిసారిగా గ్రామాభివృద్ధికి ప్రణాళిక
మన ముఖ్యమంత్రి చంద్రబాబు
– ‘రెండు చేతులు లేని దివ్యాంగులకు నెలకు రూ.10వేల చొప్పున పింఛను ఇవ్వాలనే అభ్యర్ధన వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నాం. చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.
– పింఛన్లు ఇవ్వకముందు వృద్ధులను పిల్లలు సరిగా పట్టించుకునేవారు కాదు. వారికి నెలకు రూ.1,000 ఇవ్వడం ప్రారంభించాక భరోసా లభించింది. ఇప్పుడు నెలకు రూ.2వేలు చేయడంతో వారి బాగోగులకోసం పోటీపడతారు.
‘జన్మభూమి- మావూరు’లో 5,68,616 అర్జీలు వచ్చాయని, ఇప్పటికే చాలా వాటిని పరిష్కరించామని, మిగిలిన అన్నింటికీ పరిష్కారం చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దరఖాస్తు పరిష్కరించామో లేదో తెలియజేస్తూ అర్జీదారులందరికీ లేఖలు రాస్తామని చెప్పారు. ఒకవేళ పరిష్కారం కాకుంటే ఎందుకు చేయలేకపోయామో వివరిస్తామని వెల్లడించారు. ఆకలి అనే బాధ తెలియనీయకుండా ప్రతి ఒక్కరికీ తిండి పెడతామని, ఇల్లు లేదనే పరిస్థితి రాకుండా అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని, పేదరికం అనేది లేకుండా అందరి కుటుంబాల ఆదాయం పెంచుతామని తెలిపారు. దేశానికే తెలుగుదేశం ఒక ట్రెండ్ సెట్టర్లా మారుతుందని పేర్కొన్నారు. ‘ఇళ్లు నిర్మించాలని కోరిన అర్హులందరికీ నిధుల విడుదలకు అనుమతులిస్తాం. ఇళ్ల స్థలాలు అడిగిన వారికి తక్కువ ధరలో భూమి దొరికితే కొని ప్లాట్లు కేటాయిస్తాం. భూమి ధర ఎక్కువ ఉన్న చోట జీ+3 విధానంలో ఇళ్లు నిర్మించి ఇస్తాం’ అని తెలిపారు. అనుమతుల మంజూరులో ఎలాంటి రాజకీయం, సిఫార్సులకు తావులేదని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ ఫోన్ అందిస్తామని పునరుద్ఘాటించారు. ఆరో విడత ‘జన్మభూమి -మావూరు’ శుక్రవారం ముగిసిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ఉండవల్లి ప్రజా వేదికలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘పండగలకు కానుకలు, పేదలకు బీమా, పింఛన్లు, పెళ్లి కానుక, ఎస్సీ, ఎస్టీలకు నెలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు, విద్యార్థులకు రుసుములు, ఉన్నత విద్యకు సాయం, అన్న క్యాంటీన్లు తదితర ఎన్నో సంక్షేమ పథకాలను మా ప్రభుత్వం అమలు చేస్తోంది. గాడి తప్పిన పాలనను జాతీయ రహదారిపైకి తెచ్చాం. ఇక వేగం అందుకోవడమే. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన ‘జన్మభూమి- మావూరు’ విజయవంతమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ కార్యదర్శి, ఆశా కార్యకర్తలదాకా బాగా పనిచేశారు’ అని చంద్రబాబు వివరించారు.
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అన్ని గ్రామాలు, వార్డులు, మండల స్థాయిలో 2019 నుంచి 2024 వరకు ఏం చేయాలనే విషయమై ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు కలిసి వీటిని తయారు చేసి గంట వ్యవధిలోనే ఆన్లైన్లో అప్లోడ్ చేశారని చెప్పారు. జిల్లా ప్రణాళికలను ఈ నెల 21 నుంచి విడుదల చేస్తామని తెలిపారు. తర్వాత రాష్ట్ర స్థాయి ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. ‘జన్మభూమి- మావూరు’ కార్యక్రమంలో 80 శాతం వార్తలు సానుకూలంగా వచ్చాయి. వ్యతిరేకంగా వచ్చిన 20 శాతం వార్తలనూ సమీక్షిస్తాం. అందులో వాస్తవాలుంటే సరిదిద్దుకుంటాం. కావాలని రాసిన వాటిని ప్రజల ముందుంచుతాం’ అని స్పష్టం చేశారు.
సంక్రాంతి గీతం ఆవిష్కరణ
సంక్రాంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక వీడియోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇందులో గ్రామీణ సంప్రదాయాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
భరోసా అంటే ఇదే..
‘పింఛను రూ.3వేలు చేయడం జీవితంలో మర్చిపోలేను. నా తల్లికి కూడా రూ.2వేల పింఛను వస్తోంది. రూ.5వేలతో నేను, నా తల్లి ధీమాగా జీవిస్తాం. భరోసా అంటే నిజంగా ఇదే.. ఆజన్మాంతం సీఎంకు రుణపడి ఉంటా’ అని కృష్ణా జిల్లా కపిలేశ్వరం గ్రామానికి చెందిన ఓంకార రాజు పెట్టిన పోస్టును సమాచారశాఖ కార్యదర్శి రామాంజనేయులు సమావేశంలో చదివి వినిపించారు.













