ఎదిరిస్తున్నానని… బెదిరిస్తున్నారు
బాబ్లీపైన ప్రాజెక్టు మీద ప్రాజెక్టు కడితే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందన్న ఆవేదనతోనే, ఎనిమిదేళ్ల క్రితం సమైక్య ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఆందోళన చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబబు నాయుడు పేర్కొన్నారు. తెలుగు జాతికి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతోనే నిరసన చేపట్టామే తప్ప తామేమీ నేరాలు, ఘోరాలు చేయలేదన్నారు. 2010లో బాబ్లీ ప్రాజెక్టు తను వ్యతిరేకంగా పోరాడితే, ఆ రోజు ఆ ప్రాజెక్టును రాజశేఖర్రెడ్డి సమర్థించారని అన్నారు. ఇప్పుడు ఎన్డీఏపై రాజీలేని పోరాటం చేస్తున్నందుకు ఈ రోజు అరెస్టు వారెంట్ పంపిస్తామని చెబుతున్నారన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేశారనే నరేంద్రమోదీతో విభేదించానని, కేంద్రంతో ఢీకొన్నానని చెప్పారు. ఒకరిద్దరు ఒత్తిళ్లు తెచ్చినా, బెదిరించినా భయపడకుండా ఢీకొని ముందుకెళతానే తప్ప వెనుదిరిగే ప్రసక్తే లేదని సృష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది వస్తే ఆదుకునే వ్యక్తిని తానేనని అన్నారు.













