ఏపీలో వారం రోజులు సంతాప దినాలు
మాజీ ప్రధాని వాజ్పేయీ మృతికి సంతాప సూచకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ విషయాన్ని వెలగపూడి సచివాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వెల్లడించారు. వాజ్పేయీ ఎప్పుడూ పని చేయాలని కోరుకునే వారని, దానిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో నేడు సెలవు ప్రకటించండపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తాను నేడు ఢిల్లీ వెళ్లి, నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. ఒక మంచి రాజనీతిజ్ఞుడిని కోల్పోయామన్నారు. గతంలో టీడీపీకి 29 మంది ఎంపీలు ఉండటంతో మంత్రివర్గంలో చేరమని వాజ్పేయీ చాలాసార్లు కోరేవారని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి వర్గంలో చేరలేదన్నారు. పదవుల కోసం ఆరాపటడని తన వైఖరి కారణంగా ఆయన తనతో అదరభావంతో ఉండేవారన్నారు. దానిని తాను దుర్వినియోగం చేయలేదన్నారు. తాను ఏ మంచి సూచన చేసినా, అమలు చేసేవారన్నారు. 1984లో ఎన్టీఆర్ వ్వవహారంలో చాలా సహకరించారని, ప్రజాస్వామ్యన్ని కాపాడేందుకు చొరవ చూపారన్నారు. తాను ఆయన కంటే వయస్సులో చిన్నవాడినని, అప్పట్లో యువ ముఖ్యమంత్రి నని తెలిపారు. అయినా గౌరవం ఇచ్చేవారన్నారు.













