అసమాన విభజన ద్వారా ఏపికి అన్యాయం చేశారు: ముఖ్యమంత్రి చంద్రబాబు
కనీసం కొన్ని హామీలైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వాటిని కూడా అమలు చేయకుండా బిజెపి ద్రోహం చేసింది. ఏపి ప్రజలను నమ్మించి బిజెపి మోసగించింది. కేంద్రంలో బిజెపి నేతలు పద్దతిలేని రాజకీయాలు చేస్తున్నారు. ఏపిని అణగదొక్కాలని చూస్తున్నారు. ఏ హామీని బిజెపి నేతలు నిలబెట్టుకోలేదు. లాభాలు వచ్చే అవకాశం ఉన్నా కడప స్టీల్ ఏర్పాటుకు ముందుకు రాలేదు. విశాఖ రైల్వేజోన్ ఇవ్వలేదు. వెనుకబడిన జిల్లాల నిధులు వెనక్కి తీసుకున్నారు. రాజధాని నిర్మాణానికి సహకరించలేదు. పోలవరానికి ఇంకా రూ.3500కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది ఆర్ధికలోటులో రూ.12వేల కోట్లు ఎగ్గొట్టారు. ఏదీ నెరవేర్చకుండా మోసం చేశారు.
కుటుంబం విడిపోయినా, కంపెనీ విడిపోయినా వాటాల పంపిణీ సక్రమంగా చేస్తారు. ఆస్తులు,అప్పులు సమతుల్యంగా విభజిస్తారు. ఇక్కడ ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి. జనాభా నిష్పత్తిలో వాటిని పంచుకోవాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విషయంలో సుప్రీంకోర్టు అదే చెప్పింది. దానిని అటు కెసిఆర్,ఇటు మోది ఇద్దరూ ఖాతరు చేయలేదు. ఈ ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు సృష్టించారు.అయినా పేదల సంక్షేమానికి కొరత రానివ్వలేదు. పండుగ కానుకలు ఇచ్చాం. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్ళకు ఆర్ధిక సాయం. పెన్షన్ పది రెట్లు చేశాం. ఆర్ధికంగా నిలదొక్కుకోవడం, ఆత్మగౌరవంగా జీవించేలా చేశాం.
మెట్టప్రాంతంలో ఎకరాకు రూ.8వేలు కౌలు ఇస్తారు. 3 ఎకరాలకు రూ.24వేల కౌలు వస్తుంది. ఇప్పుడు వృద్దులకు,ఒంటరి మహిళలకు పించన్ రూపంలో ఏడాదికి రూ.24వేలు ఇస్తున్నాం. 3ఎకరాల భూమిపై వచ్చే కౌలుతో సమానంగా పించన్ ద్వారా ఇస్తున్నాం. రెండు చేతులు లేని దివ్యాంగులకు రూ.10వేలు ఇవ్వాలని అనుకున్నాం. ప్రతి ఇంటి పెద్దకొడుకుగా ఉంటానన్న మాట నిలబెట్టుకున్నాను.
రూ.24వేల కోట్లు రుణమాఫీ రైతులకు చేశాం. రూ.10వేల కోట్ల పసుపు-కుంకుమ మహిళలకు ఇచ్చాం. 4లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం.
కేంద్రం సహకరించివుంటే పేదలను ఇంకా బ్రహ్మాండంగా ఆదుకునేవాళ్లం. ప్రపంచంలోనే శరవేగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు పోలవరం. ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు పూర్తి. కుప్పం కన్నా ముందే పులివెందులకు నీళ్లిస్తామన్న మాట నిలబెట్టుకున్నాను.













