Chandrababu: పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి : చంద్రబాబు
ప్రజలే ముందు ఆ తర్వాతే మిగతా పనులని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పని చేస్తున్నట్లు చెప్పారు. బాపట్ల జిల్లా (Bapatla District) చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు (Pensions) అందించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకువెళ్తున్నామన్నారు.
పెంచిన పింఛన్లను గత ఏప్రిల్ (April)నుంచే అమలు చేస్తున్నాం. దివ్వాంగులకు రూ.6వేల పింఛన్లు ఇస్తున్నాం. కోటిన్నర కుటుంబాలకు గానూ 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చువుతోంది. ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పించన్లతో సమానం. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఒక నెల తీసుకోకపోతే, రెండు లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చాం. రెండు నెలలు పింఛన్లు తీసుకోని ఆరు 93,300 మంది ఉన్నారు. మిగుల్చుకోవాలంటే నెలకు రూ.76 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుంది. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నాం. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.













