మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు
మాజీ మంత్రి, టీడీపీ నేత పి. నారాయణ ఇళ్లు, నారాయణ విద్యా సంస్థల్లో సీఐడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. చింతారెడ్డి పాలెంలోని ఆయన నివాసంలో సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల నేపథ్యంలో ఇంట్లోకి ఎవర్నీ అనుమతించడం లేదు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్… ఇలా దాదాపు 10 ప్రాంతాల్లో సీఐడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్ కూకట్పల్లిలోని నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నెల 22 న విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. మోసంతో అసైన్డ్ భూములను లాక్కొన్నారన్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో సహా 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే ఆళ్ల ఏమని ఫిర్యాదు చేశారంటే…..
గత ప్రభుత్వంలోని కొందరు చట్ట విరుద్ధంగా, మోసపూరితంగా తమ భూములు లాక్కొన్నారని వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలు కొందరు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల… సీఐడీకి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చట్టవిరుద్ధంగా రైతుల భూములు లాక్కొన్నారని, ఎలాంటి పరిహారం లేకుండానే అసైన్డ్ భూములు తీసుకుంటుందని కొందరు చెప్పినట్లు నియోజకవర్గ ప్రజలు ఆళ్లతో చెప్పారు. దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సీఐడీ… ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులిచ్చారు.













