చంద్రబాబుకు సీఐడీ నోటుసులు.. అసలేం జరిగింది..?
రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనేది నాటి సీఎం చంద్రబాబునాయుడు కల. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య కృష్ణానది ఒడ్డున రాజధాని నిర్మిస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని.. నదీముఖంగా ఉన్న ఎన్నో నగరాలు ప్రపంచంలో అభివృద్ధి చెందాయని ఆయన భావించారు. అందుకు అమరావతి సరైన ప్రదేశమని భావించి అక్కడ రాజధాని ప్రకటన చేశారు. ప్రధాని మోదీ రాజధాని నగరానికి శంకుస్థాపన చేశారు.
అమరావతి ప్రాంతం సారవంతమైన నేల. కృష్ణానది ఒడ్డునే ఉన్న ఆ ప్రాంతంలో మూడు పంటలూ పండుతాయి. అలాంటి భూములను రైతులు ఇవ్వరని భావించిన ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరుతో వాటిని సేకరించింది. అంటే రైతులు ఇచ్చిన భూమికి వెలకట్టి అందుకు అనుగుణంగా అభివృద్ధి చేసిన భూమిని ఇస్తారు. అప్పుడు రాజధానిలో వారికి భాగస్వామ్యం ఉండేలా వ్యూహరచన చేశారు. గంపగుత్తగా రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఇక్కడి రైతులు వ్యతిరేకిస్తారేమోనని భావించి పూలింగ్ కు మొగ్గు చూపింది. ఇలా 30వేలకు పైగా ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం సేకరించింది.
కొంతమంది రైతులు స్వచ్చంధంగా ముందుకొచ్చి భూములిచ్చారు. కొంతమంది ముందుకు రాకపోవడంతో వారి నుంచి బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వం సేకరించింది. అయితే వీటిని సేకరించేటప్పుడు కేబినెట్ ఆమోదం లేకండానే వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కింద వీటిని సేకరించింది. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. నాడు సీఆర్డీఏ ఛైర్మన్ గా ఉన్న చంద్రబాబు.. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ భూములను బదలాయించారు. ఇందుకు వారే బాధ్యులని ప్రభుత్వం చెప్తోంది.
అయితే అప్పట్లో తమ అసైన్డ్ భూములను ప్రభుత్వంలోని పెద్దలు బలవంతంగా లాక్కున్నారని.. తమకు న్యాయం చేయాలని కొంతమంది రైతులు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కొంతమంది రైతులు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఫిబ్రవరి 24న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రాజధాని భూఅవకతవకలపై విచారణ జరుపుతున్న సీఐడీ.. ఈ ఫిర్యాదును కూడా స్వీకరించి మార్చి 12న కేసు నమోదు చేసింది. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీలోని సెక్షన్లు 166, 167, 217, 120బి కింద కేసులు బుక్ చేసింది. ఆ మేరకు తాజాగా నోటుసులు అందించింది. 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.













