మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు.. ముగిసిన లోకేశ్ సీఐడీ విచారణ
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో రోజు సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోకేశ్‌ను సీఐడీ అధికారులు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక్క రోజే విచారణకు హాజరు కావాలని చెప్పినా, సీఐడీ అధికారుల సూచన మేరకు రెండో రోజు కూడా విచారణకు హాజరయ్యా. రెండో రోజు 43 ప్రశ్నలు అడిగారు. అవి కూడా నిన్న అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారు. వాషింగ్ మెషీన్లో వేసి తిప్పినట్టుగా మంగళశారం అడిగిన ప్రశ్నలే తిప్పి తిప్పి అడిగారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్ నా ముందు పెట్టి ప్రశ్నించారు. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ మీ వద్దకు ఎలా వచ్చిందని దర్యాప్తు అధికారిని అడిగితే సమాధానం చెప్పలేదు. దీనిపై న్యాయ పరంగా పోరాటం చేయాలనుకుంటున్నా. ఇన్నర్ రింగ్‌రోడ్డుకు సంబంధించి కేవలం నాలుగైదు ప్రశ్నలు మాత్రమే అడిగారు. నా శాఖకు సంబంధం లేని ప్రశ్నలు పదే పదే అడిగారు. మళ్లీ నోటీసు ఇస్తారా? అని దర్యాప్తు అధికారిని అడిగితే సమాధానం చెప్పలేదు అని అన్నారు.
హెరిటేజ్ కొనుగోలు చేసిన 9 ఎకరాలు గూగుల్ ఎర్త్‌లో చూపించారు. ఐఆర్ఆర్ వల్ల హెరిటేజ్ భూములు కోల్పోయినట్టు చూపించారు. ఐఆర్ఆర్లో నాకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి పాత్ర లేదు. పదేళ్ల నుంచి మా కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటిస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శిగా అనేక పనులు ఉంటాయి. రెండు రోజుల పాటు నా సమయం వృథా చేశారు. స్కిల్ కేసులో సంతకాలు పెట్టిన ఇద్దరు అధికారులను విచారించట్లేదు. ప్రేమ్‌చంద్రారెడ్డి, అజేయ్ కల్లంను ఎందుకు విచారించట్లేదు. పాలసీ ఫ్రేమ్ చేసిన చంద్రబాబును మాత్రం రిమాండ్‌కు పంపారు. లింగమనేని రమేశ్ ఇంట్లో అద్దెకు ఉంటూ రూ.27 లక్షల రెంటల్ అడ్వాన్స్ కట్టారని చెప్పారు. రెంటల్ అడ్వాన్స్‌కు సంబంధించి ఐటీ రిటర్న్స్‌లో లేదని తెలిపారు. ఐటీ రిటర్న్‌లకు సంబంధించి ఆడిటర్‌ను అడగాలని చెప్పా. ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు.













