ఏపీకి మరో అరుదైన గుర్తింపు.. దేశంలోనే తొలిసారిగా
దేశ, విదేశాలను ఆందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్ వ్యాధి నిర్ధారణలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేసింది. ఈ వ్యాధి నిర్ధారణకు అవసరమైన కిట్ ను విశాఖ మెడిటెక్ జోన్ రూపొందించి అరుదైన గుర్తింపును పొందింది. మంకీ ఫాక్స్ వ్యాధి నిర్ధారణకు పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేసి తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటింది. సచివాలయంలో మంకీ ఫాక్స్ మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను ముఖ్యమంత్రి చంబ్రాబు నాయుడు ఆవిష్కరించారు. విశాఖ మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీపీసీఆర్ కిట్‌ను సీఎం చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ కిట్‌ను తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్‌టెక్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.
మెడ్‌టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్‌డెక్స్ మంకీపాక్స్ ఆర్టీ పీసీఆర్ కిట్ పేరిట ఈ కిట్ రూపకల్పన చేసినట్లు సీఈఓ జితేంద్ర శర్మ సీఎంకు వివరించారు. ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించిందని తెలిపారు. మంకీపాక్స్ నిర్దారణకు దేశీయంగా మొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను రూపొందించిన మెడ్ టెక్ జోన్ ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అభినందించారు.













