ఏపీ కేబినెట్ సమావేశం లోని అంశాలు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ అందజేసిన నివేదికలోని సూచలనపై కేబినెట్ సమావేశంలో సూత్రపాయంగా చర్చ జరిగింది. ఇదే విషయాన్ని మంత్రి కురసాల కన్నబాబు గారు కూడా ధ్రువీకరించారు. అయితే, రాజధాని విషయంలో మరో అధ్యయన కమిటీ నివేదిక రావాల్సి ఉందని గుర్తుచేశారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక గురించి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని.. జీఎన్ రావు కమిటీ నివేదిక, బీసీజీ నివేదికలు రెండింటినీ క్రోడీకరించి అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ
రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జనవరి 20 తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మూడు రాజధానుల నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
జనవరి 18 నుంచి 20 వ తేదీ మధ్యలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మూడు రాజధానులపై తుది నిర్ణయం తీసుకోనుంది. హైపవర్ కమిటీలో మంత్రులు, అధికారులు ఉండనున్నారు. జనవరి 14లోపు నివేదిక సమర్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. జనవరి 3న బోస్టన్ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.













