ఏపీ కేబినెట్ మీటింట్.. కీలక నిర్ణయాలు ఇవే…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నాడు నేడు కింద స్కూళ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని మంత్రి పేర్నినాన్ని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేశామని, మెరుగైన విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్షని పేర్కొన్నారు. ఏ తరగతికైనా తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుందన్నారు. ప్రాథమిక దశలో మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో కొత్తగా 6,22,856 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్, ప్రతి తరగతికి ఒక తరగతి గది ఉంటుందన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 4,800 తరగతి గదులు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా చదువులో వెనుకబడకూడదనేదే ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. మంచి విద్య అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. ఈ నెల 16న విద్యాకానుక అందిస్తామన్నారు. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన 3 లక్షల 40 వేల మంది అగ్రిగోల్డ్ బాధితులకు నగదు పంపిణీ చేస్తాం. ఇకపై కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారీటీగా గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అభ్యంతరం లేని భూముల్లో అక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షలు ఇస్తామని తెలిపారు.













