కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం తొలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ సుమారు ఆరు గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. అక్టోబర్ నుంచి 12,500 చెల్లింపుతో రైతు భరోసా అమలు, వైఎస్సార్ ఆసరా కింద వృద్ధాప్య పింఛన్లను రూ.2,250కి పెంపు, ఆశా వర్కర్లకు రూ.10వేల వేతనాల పెంపునకు సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. దీంతోపాటు గిరిజన ప్రాంతాల్లో హెల్త్ వర్కర్లకు భారీగా వేతనాలు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రూ.400 నుంచి రూ.4వేల పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏల పరిధిలో 7,265 మంది హెల్త్వర్కర్లకు దీని ద్వారా ప్రయోజనం కలగనుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ చెల్లింపునకు ఆమోదం. పెంచిన ఐఆర్ జులై నుంచి అమలు. జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులను ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలన్నీ రద్దు. పారదర్శకంగా కొత్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఏర్పాటు. మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.18 వేలకు పెంపు. కొత్త ఇసుక విధానం. స్కాం లను వెలికితీస్తే అధికారులతో పాటు మంత్రులను సైతం సన్మానించాలని నిర్ణయించారు. అన్ని నామినెటెడ్ పదవుల రద్దుకు త్వరలో ఆర్డినెన్స్. ప్రతి ఏటా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం. అంగన్ వాడీ, హోంగార్డుల జీతాల పెంపు.













