ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఇందులో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఏడు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త నిర్ణయాలు కాకుండా ఉన్నవాటికే కాస్త మెరుగులు దిద్దారు. ఇందులో భాగంగా మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముదిరాజ్/ ముత్రాసి/ తెనుగోళ్లు…నగరాలు/ నాగవంశ, కల్లు /నీరా కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరో 13 బీసీ కార్పోరేషన్లకు మేనేజింగ్ కమిటీ విధివిధానాల ఖరారుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.
యానాదులు, చెంచులు ఇళ్ల నిర్మాణంలో రాయితీ పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగైతే రాయితీ ఇస్తున్నారో వారికి కూడా అలానే రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. డ్రైవర్ల సంక్షేమ సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సింహాచల భూముల అంశంపైనా కేబినెట్లో చర్చ జరిగింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని సీఎం ఆదేశించారు. ఎక్సైజ్ శాఖలో పోలీసుల పదోన్నతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కానిస్టేబుళ్లుగా ఉద్యోగంలో చేరి 25 ఏళ్లు దాటినా పదోన్నతలు రానివారు ఉన్నారని.. అలా ఉద్యోగ విరమణ చేయడం సబబు కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పదోన్నతుల అంశానికి ఆమోదం తెలిపారు. కానిస్టేబుళ్ల హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇవ్వాలని నిర్ణయించారు.













