ఏపీ కేబినెట్ సమావేశం నిర్ణయాలు
ప్రత్యేక హోదా, వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసులు ఎత్తివేత – సమైక్యాంధ్ర ఉద్యమంలో మిగిలిన కేసులు ఎత్తివేతకూ కేబినెట్ ఆమోదం – కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు ఆమోదం – ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న ప్రభుత్వం – అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపుపై కీలక నిర్ణయం – ప్రత్యేక హోదా, వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసులు ఎత్తివేత – సమైక్యాంధ్ర ఉద్యమంలో మిగిలిన కేసులు ఎత్తివేతకూ కేబినెట్ ఆమోదం – హై కోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్ చేసి బాధితులకు చెల్లించాలని కేబినెట్ నిర్ణయం – ఆస్తుల వేలం తర్వాత కోర్టు నుంచి నగదు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం – పసుపు – కుంకుమ పంపిణీకి కేబినెట్ ఆమోద ముద్ర .
మంత్రిమండలి సమావేశం నిర్ణయాలు..-31.01.2019..
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసుల ఎత్తివేతపై చర్చ:
• సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో, తరువాత ప్రత్యేక హోదా కోసం చేసిన ఆందోళనల్లో పెట్టిన కేసులు, రాష్ట్ర హక్కుల కోసం (బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం) పోరాడినవారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయం.
• నిర్వాసితుల (పోలవరం, వంశధార ప్రాజెక్టులలో) కోసం చేసిన ఆందోళనల్లో పాల్గొన్నవారిపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని నిర్ణయం.
ఖైదీల విడుదల :
• రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 33 మంది ఖైదీలకు విముక్తి కల్పించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
• ఇప్పటికే 5 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన వారు, 65 సంవత్సరాల వయసు పైబడి వ్యాధులతో బాధపడుతూ జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి ప్రత్యేక పరిస్థితుల కింద ఉపశమనం కల్పించాలని మంత్రివర్గం అభిప్రాయపడింది.
9న సామూహిక గృహ ప్రవేశాల వేడుక :
• 9వ తేదిన నెల్లూరులో భారీఎత్తున సామూహిక గృహ ప్రవేశాల పండుగ.
• అర్బన్‌లో లక్ష, రూరల్‌లో 3లక్షల ఇళ్లు చొప్పున మొత్తం 4లక్షల ఇళ్లకు ఒకేరోజు సామూహిక గృహ ప్రవేశ వేడుకలు.
• తరువాత ఎక్కడికక్కడ నియోజకవర్గాలలో వేడుకలకు అక్కడి ప్రజాప్రతినిధులు హాజరవుతారు.
జయహో బీసీ హామీలపై చర్చ:
• వెంటనే జీవోలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. పకడ్బందీగా నిబంధనలు రూపొందించాలి. బీసీలలో పేదరికం నిర్మూలనే లక్ష్యంగా చేయాలి: ముఖ్యమంత్రి
ఫెడరేషన్లు ఇక కార్పొరేషన్లు :
• ఫెడరేషన్లను కార్పోరేషన్లుగా చేయడంపై చర్చ. మార్పిడికి చేయాల్సిన నియమ నిబంధనలపై చర్చ. జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ లబ్ది అట్టడుగు వర్గాల ప్రజలందరికీ అందాలన్న సీఎం.
పెన్షన్ల పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర :
• వివిధ రకాల పెన్షన్ల పెంపుదల చేస్తూ జనవరి 25న జారీ చేసిన ఉత్తర్వులను మంత్రి మండలి ఆమోదించింది.
• వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత, ఒంటరి మహిళ, మత్స్యకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారు, 40 నుంచి 79 శాతం ఉన్న అంగ వైకల్యం గల వారికి ఇస్తున్న 1000 రూపాయల పెన్షన్‌ను 2000కు పెంచాలని నిర్ణయించారు.
• 80 శాతం పైగా అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, ట్రాన్స్ జెండర్ లకు 1500 నుంచి 3000 రూపాయలు పెరుగుతుంది. అదే విధంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వ, నెట్ వర్క్ ఆస్పత్రులలో డయాలసిస్ తీసుకుంటున్న వారికి 2500 నుంచి 3500 రూపాయలకు పెన్షన్ పెంచారు.
మరో 3.55 లక్షల మందికి పెన్షన్లు :
• ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అదనంగా మరో 3 లక్షల 55 వేల మందికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వులపై కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
• 2, 3, 4 తేదీలలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలి.. వీలయితే ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్ అందజేయాలని ముఖ్యమంత్రి సూచన.
డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు :
• డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు పసుపు కుంకుమ -2 పథకం కింద అదనంగా 10 వేల రూపాయలు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కేబినెట్ ఆమోదించింది. దీన్ని 3 విడతల్లో 2500, 3500, 4000 రూపాయలుగా డ్వాక్రా మహిళలకు పంపిణీ చేస్తారు.
నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్:
• నాయీ బ్రాహ్మణులకు(బార్బర్లు) వ్యవసాయ వినియోగదారుల మాదిరిగానే ఉచిత విద్యుత్ అందించాలని మంత్రి మండలి నిర్ణయించింది. 150 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్స్‌కు ఉచితంగా కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
• ఇప్పటికే ప్రజాసాధికార సర్వేలో నాయీ బ్రాహ్మణులు 4 లక్షల 65 వేల మందికి పైగా ఉంటే 3000 సొసైటీలలో లక్షకు పైగా రిజిస్టర్ అయి ఉన్నారు. 17వేలకు పైగా షాపులకు ఈ నిర్ణయం ద్వారా సుమారు రూ.32 కోట్లు లబ్ధి చేకూరుతుంది. బిసి కార్పోరేషన్ నుంచి బడ్జెట్ కేటాయిస్తారు.
• ఇప్పటికే ధోబిఘాట్లకు ఉచిత విద్యుత్ అందిస్తోన్న ప్రభుత్వం ఎంబీసీలకు 100 యూనిట్లు, చేనేత కార్మికులకు 150 యూనిట్లు ఇచ్చేలా నిర్ణయించింది. అంతేగాక లాండ్రీ, డ్రైక్లీనింగ్‌కు ఉచిత విద్యుత్ అందించే దిశగా కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
సుబాబుల్ రైతులకు అండ :
• సుబాబుల్ రైతులను ఆదుకోవడంపై కేబినెట్లో చర్చ. సుమారుగా రూ.70కోట్లు బడ్జెట్ అవుతుందన్న మంత్రి సోమిరెడ్డి. అదనంగా రూ.300 చొప్పున ఇచ్చి రైతులను ఆదుకునే అంశాన్ని పరిశీలించాలి. ఇప్పుడే ఎంత అవుతుందో, ఏడాదికి ఎంత దిగుబడి వస్తుందో చెప్పాలని ఆదేశం. రూ.70కోట్లు అవుతుందని అంచనా.
గ్రామీణ మంచినీటి సరఫరా:
• చిత్తూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు బ్యాంకు రుణాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంచినీటి సరఫరా సంస్థకు 1765 కోట్లు. ఆరు సెక్టారులలో (sector 2-7) ఒక్కో సెక్టారుకు 6376 గృహాలకు మంచినీటి సరఫరా.













