అగ్రిగోల్డ్ అంశంపై మంత్రిమండలి చర్చ
అమరావతి, డిసెంబర్ 21 : అగ్రిగోల్డ్ అంశంపై ఈరోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో చర్చకు వచ్చింది. హాయ్ ల్యాండ్ ఆస్తుల వేలంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను అధికారులు మంత్రిమండలి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, ఫిబ్రవరి 8లోపు ఆక్షన్ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.
బాధితులకు ఎంత త్వరగా న్యాయం జరిగితే ఆ కుటుంబాలలో అంత భరోసా వస్తుందన్నారు. హాయ్ ల్యాండ్‌తో పాటు మిగిలిన అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం కూడా త్వరితగతిన జరిగేలా కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ అంశంపై ఈనెల 28న జరిగే విచారణలో హైకోర్టుకు వాస్తవ వివరాలు నివేదించాలన్నారు. ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేసేలా చూడాలని సూచించారు.
కరవు, ఫెతాయ్ తుఫాన్ పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అంశాలపై కూడా మంత్రిమండలి చర్చించింది. తుఫాన్ నష్టం వివరాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామని, కేంద్రం నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.













