చినజీయర్ ట్రస్ట్‌కు ఏపీ సర్కారు కానుక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. సమావేవంలో భాగంగా శాసనమండలి రద్దుకు కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో పాటు కేబినెట్ మరో నిర్ణయాన్ని తీసుకుంది. విజయవాడలోని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ ట్రస్టుకు 40 ఎకరాలు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. గుంటూరు జిల్లా సీతా నగరం సమీపంలో విజయకీలాద్రి కొండపై పలు దేవాలయాల సముదాయాన్ని చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలో 40 ఎకరాలు కేటాయిస్తూ తీర్మానం చేశారు. కాగా చినజీయర్ స్వామికి ముఖ్యమంత్రి జగన్‌కు మధ్య దీర్ఘకాలంగా సఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఏపీలో పాదయాత్ర చేపట్టబోతున్న తరుణంలో చిన జియర్ స్వామిని కలిసిన జగన్ ఆ సందర్భంగా స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. అనంతరం ఎన్నికల ముందుకూడా చినజీయర్‌తో జగన్ భేటీ అయ్యారు. తాజాగా ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సహజంగానే చర్చకు దారితీస్తోంది.













