బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికిగాను బడ్జెట్ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలన అనంతరం దీన్ని వేర్వేరుగా మంత్రులందరికీ ఆర్థికశాఖ అధికారులు ఆన్లైన్ ద్వారా పంపించారు. దీనికి మంత్రులు అంగీకారం తెలియజేయటంతో రూ.90 వేల కోట్లతో బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్రపడింది. మే నెలాఖరు లేదా జూన్‌లో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు కరోనా వ్యాక్సినేషన్ లాంటి వేర్వేరు కారణాలతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేకపోవటంతో బడ్జెట్ ఆర్డినెన్స్ అవసరమైంది.
మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ప్రస్తుత వ్యయాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, నవరత్నాల పథకాల అమలు, ఇతర వ్యయాల నిర్వహణ కోసం 3 నెలల కాలానికి గాను ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జరగలేదు. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.













