నమ్మి ఉన్నందుకు అవమానిస్తారా… కుతకుతలాడుతున్న హరిబాబు
కేంద్రమంత్రి పదవి ఏపీలోని బీజేపీ సీనియర్ నేతకు అనుకోని కష్టాలను తెచ్చి పెట్టింది. పదవి వస్తుందని కొండంత ఆశతో కుటుంబాన్ని పెట్టుకుని ఢిల్లీ వెళితే అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఎందుకు పిలిచారు… ఎందుకు అవమానిస్తున్నారని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఆయనే ఏపీలో బీజేపీకి వెంక్యయనాయుడు తర్వాత పెద్ద దిక్కు. ఎన్నాళ్లుగానో పార్టీనే నమ్ముకుని ఉన్న కంభంపాటి హరిబాటు. హరిబాబుకు తాజా మంత్రివర్గ విస్తరణలో చోటు ఖాయమని ఎన్నాళ్ల నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లే మొన్న మంత్రివర్గ విస్తరణకు ముందు రోజు రాత్రి పార్టీ చీఫ్ అమిత్ షా నుంచి హరిబాబుకు కబురు వచ్చిందట. దాంతోనే ఆయన ఇక్కడ కార్యక్రమాలను మధ్యలోనే వదిలేసి కుటుంబ సభ్యులను తీసుకుని హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. అయితే, తెల్లారే సరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. అధికార పార్టీ నేతలు చేసిన లీకుల నుంచి పీఎంఓ నుంచి వచ్చిన అధికారిక జాబితా వరకూ ఎందులోనే హరిబాబు పేరు కనిపించలేదు. దాంతో అవాక్కవడం హరిబాబు వంతైంది.
అమిత్ షా రమ్మంటేనే తాను ఢిల్లీ వచ్చానని… ఇప్పుడేమో మోడీ వద్దంటున్నారని చెబుతున్నారని ఇదంతా ఏమిటని తన సన్నిహితుల వద్ద హరిబాబు ఆగ్రహం ప్రదర్శించారట. తొలి నుంచే పార్టీనే నమ్ముకుని ఉన్న నన్ను గౌరవించే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించారట. ఒక దశలో ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటూ ఇంకా పార్టీలో ఎందుకుండాలంటూ తన ఆవేదనను వెళ్లగక్కారని సమాచారం. అయితే, అంతలోనే రంగంలోకి దిగిన బీజేపీ పెద్దలు కొందరు హరిబాబును అనునయించారట. వాస్తవ పరిస్థితులు ఆయనకు వివరించి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ వర్గాల కథనం.













