ఏపీ బిజేపి క్లోజ్ అయినట్టేనా ?!!
ఏపీలో బిజెపి ప్రయాణం అనేది అనుకున్నంత సులువు కాదు. నవ్వుకున్నా, కోప్పడినా సరే ఆ పార్టీ ఏపీలో ఇంకో 25 ఏళ్ళు రాజకీయం చేసినా సరే స్వతంత్రంగా పోటీ చేసి ఎమ్మెల్యే సీటు గెలవడం కష్టమని… బిజెపి నేతలే అంటూ ఉంటారు. రాజకీయం అనేది మతాల ఆధారంగా బిజెపి చూస్తుందని చాలా మంది ఆరోపిస్తూ ఉంటారు. ఏపీలో కూడా అలాగే చూసి బిజెపి తప్పు చేసింది. అందుకే 2019 ఎన్నికల్లో నరసరావు పేట పార్లమెంట్ లో పోటీ చేసిన అప్పటి బిజెపి చీఫ్ కన్నా… నోటాతో పోటీ పడ్డారని అంటారు.
ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ చాలా ఎక్కువ. గుంటూరు జిల్లాలో ఆయన బలమైన లీడర్ గా ఉన్నారు. కాంగ్రెస్ లో తిరుగులేని శక్తిగా కూడా ఎదిగారు. కాని బిజెపిలో అడుగుపెట్టాక ఆయన చరిత్ర ఏ మాత్రం పనికి రాలేదు. దక్షినాది రాష్ట్రాల్లో కేరళ తర్వాత హిందు మత ప్రచారం ఉండే రాష్ట్రం ఏపీ. అలాంటి ఏపీకి అన్యాయం జరుగుతుంటే… హిందూమత ప్రచారం ఎక్కువగా ఉండే ఏపీలో మతం ద్వారా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసి బిజెపి నేతలు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. తెలంగాణాలో జై శ్రీరాం అని ఒక ప్రాంతంలో కాకపోతే మరో ప్రాంతంలో అంటూ ఉంటారు.
ఉత్తరాది ప్రభావం కూడా కాస్తో కూస్తో ఉంటుంది. కాని ఏపీలో మాత్రం అలాంటి సినిమా లేదు. కాబట్టి అభివృద్ధి పై, సంక్షేమం పై మాత్రమే ప్రజలకు నమ్మకం కలిగించాలి. కాని ఇందులో బిజెపి ఎక్కడా కూడా విజయవంతం కావడం లేదు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే… ఇటీవల బడ్జెట్ లో కూడా ఎపీకి న్యాయం జరగలేదు. ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మాలి అని భావిస్తుంది. ప్రజల ఆకాంక్షలకు ఏపీలో ఎప్పుడు కూడా బిజెపి విలువ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అందరూ మద్దతు ఇచ్చిన అమరావతికి కూడా బిజెపి సహకరించలేదు.
జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో కూడా కేంద్రం ఇలాగే వ్యవహరిస్తుంది అనే మాట వాస్తవం. విశాఖ ఉక్కు భూములు అమ్మితే మన కష్టాలు తీరతాయని సిఎం జగన్ చెప్పారు… అంటే జగన్ ని కూడా కేంద్రం తన ఆధీనంలో ఉంచుకుని… ఉక్కుని అమ్మాలి అని నిర్ణయించింది. దీనితో ఏపీలో భిజేపి ఉనికి అనేది ఇంకా పూర్తిగా చచ్చిపోయింది అనే మాట నిజం. కేంద్ర పెద్దల వైఖరే దీనికి ప్రధాన కారణం.
ఏపీలో జరుగుతున్న దేవాలయాలపై దాడుల అంశంలో కూడా కేంద్ర హోం శాఖ చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. సిబిఐ అంతర్వేది ఘటనను టేకప్ చేసినా చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళిన పరిస్థితి లేదు. ఇక ఏపీ బిజెపి నేతలు కూడా ఏమీ అనలేక, కక్కలేక మింగలేక రాజకీయం చేస్తున్నారు. ఏపీలో బిజెపిని ముందుకు నడిపించాలి అంటే ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకోవడం మినహా మరో రాజకీయం లేదు. నాకొచ్చే ప్రయోజనం ఏమీ లేదు కదా అని.. తెప్ప తగలేస్తే… కాంగ్రెస్ కంటే దారుణంగా మారే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసింది. కేంద్రం అవకాశం ఉన్నా సరే ఇచ్చే సాహసం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఆస్తులు అమ్ముతుంది. దీనితో ఇక బిజెపి ప్రశ్నార్ధకమే.













