‘ఆనందయ్య మందు’ హాని కాదు : రాములు

కరోనా రూపుమాపడానికి ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు ద్వారా ఎలాంటి ప్రమాదమూ లేదని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు ప్రకటించారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రజలకు పంపిణీ చేయవచ్చని పేర్కొన్నారు. ఆయుర్వేద మందు నివేదికను ఆయుష్ కమిషనర్ రాములు సీఎం జగన్‌కు అందజేశారు. మూడు, నాలుగు రోజుల తర్వాత పూర్తి నివేదిక వస్తుందని, సీసీఆర్‌ఏఎస్ నివేదిక వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాములు ప్రకటించారు. ఆనందయ్య ఇప్పటికే 80 వేల మందికి దీనిని సరఫరా చేశారని అంటున్నారని, ఇంత భారీ సంఖ్యలో మందు తీసుకుంటే ఒకరిద్దరికి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. దీనిని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరమే లేదని రాములు తేల్చి చెప్పారు. కానీ, క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ పుస్తకాల్లో లేని మందుకు ఏదైనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుందని, ఏ మోతాదులో ఆ పదార్థాలు వాడుతున్నారనేది కూడా ముఖ్యమేనని అన్నారు. వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్నది తమకు తెలియదని, దీనిపై కంటి వైద్యుల సలహాలు కూడా తీసుకుంటామని రాములు తెలిపారు.