ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 21 నుంచి అయిదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న జీపీఎస్ సంబంధిత బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల సమావేశంలో కొన్ని మార్పులు కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరి కొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వ, పార్టీ ప్రతినిధులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.













