ఈ నెల 24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 24 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశం అనంతరం చీఫ్ విప్ ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. బడ్జెట్ సెషన్ కావడంతో శని, ఆదివారాల్లోనూ ( 18,19) సమావేశాలు కొనసాగుతాయన్నారు. 21, 22 అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించామన్నారు. సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ప్రతిపక్ష నేతను కూడా సభకు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధమని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.













