ప్రజల మొగ్గు టవర్ ఆకృతికే!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ భవనానికి, సూది మొనను పోలిన పొడవైన టవర్ ఆకృతే ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రజలు కూడా దానికే మొగ్గు చూపుతున్నారు. శాసనసభ భవనానికి సంబంధించి నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ రూపొందించిన రెండు ఆకృతుల్ని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) సామాజిక మాధ్యమాల్లో ఉంచి జనాభిప్రాయం కోరింది. గురువారం రాత్రి 7 గంటల నుంచి 20,225 మంది స్పందించారు. వారిలో 13,915 మంది టవర్ ఆకృతికి ఓటు వేయగా, 6,130 మంది చతురస్రాకారపు ఆకృతి బాగుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నార్మన్ ఫోస్టర్ సంస్థ అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని, లేకపోతే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తీసుకోవచ్చునని సమాచారం.













