విశాఖ స్టీల్‍ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా… అసెంబ్లీలో తీర్మానం

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే వ్యూహాలకు కేంద్రం పదను పెట్టిన విషయం తెలిసిందే. ప్రైవేటీకరణ పక్రియను ఇప్పటికే కేంద్రం వేగవంతం చేసింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ…విశాఖ స్టీల్‍ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం జరిగింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానం శాసనసభ ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ స్టీల్‍ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ప్రధానమంత్రి మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రైవేటీకరణ కాకుండా ముఖ్యమంత్రి తన లేఖలో అయిదు ప్రత్యామ్నాయాలు సూచించారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‍ప్లాంట్‍కు క్యాప్టిన్ మైన్స్ కేటాయించాలని, స్టీల్‍ప్లాంట్ నష్టాల నుంచి బయట పడేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని మరోసారి గుర్తు చేశారు. ఈ తీర్మానం అనంతరం అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.