ఏపీ, తెలంగాణలోనూ పరీక్షలు వాయిదా పడతాయా..?
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా కనిపిస్తోంది. పలు రాష్ట్రాలు సెకండ్ వేవ్ దెబ్బకు కకావికలమైపోతున్నాయి. ఇదే పరిస్థితి మరో ఐదారు వారాలు ఉంటుందని చెప్తున్నారు. అప్పటికే కేసుల సంఖ్య ఇప్పటికంటే మూడింతలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది పరీక్షల సీజన్. ఇప్పటికే బయట తిరిగే పరిస్థితి లేదు. అలాంటప్పుడు పిల్లలు బయటికొచ్చి పరీక్షలు రాసే అవకాశమే లేదు. పైగా ఈ సెకండ్ వేవ్ ఎంతకాలం ఉంటుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. పరీక్షలను వాయిదా వేయాలని పలువురు సూచిస్తున్నారు.
దేశవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు. సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తూ.. పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పిల్లలకు కాస్త ఊరట లభించింది. ప్రధాని నిర్ణయాన్ని విపక్షాలు కూడా స్వాగతించాయి. తమ మాట విన్నందుకు ఎంతో సంతోషం అంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ప్రధాని మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కేజ్రివాల్ స్పందించారు. అటు పిల్లలు, తల్లిదండ్రులు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలపై ఇంకా సందిగ్ధత నెలకొంది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కాస్త బెటర్ గానే ఉంది. అయితే కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఇలాగే పెరిగితే మరో నాలుగైదు వారాల్లో మహారాష్ట్ర స్థాయికి చేరుకుంటామని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే పరీక్షలపై ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వాలకు విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఇవాళ కీలక సమీక్ష చేయబోతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో టెన్త్, ఇంటర్ తో పాటు మిగిలిన పరీక్షలపైన కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు రద్దు చేసే ఆలోచన లేకపోయినా వాయిదా వేయడం పక్కా అని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పటికిప్పుడు పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించట్లేదు. సెకెండ్ వేవ్ మొదలైన తర్వాత కూడా ఏపీలో స్కూళ్లు, కాలేజీలు కంటిన్యూ అవుతున్నాయి. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు తెరిచి మళ్లీ మూసేసారు. కానీ ఏపీలో మాత్రం అలాగే నడుస్తున్నాయి. అదే బాటలోనే మరికొన్నాళ్లు పయనిస్తుందని చెప్తున్నారు. కరోనాపై ఇవాళ, రేపు సీఎం జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా పరీక్షలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికైతే పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. అయితే తుది నిర్ణయం మాత్రం సీఎందేనని వెల్లడించారు. బహుశా ఇవాళ, రేపు జరిగే సమీక్షల్లో దీనిపై ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.













