వ్యవసాయానికి బడ్జెట్ లో పెద్దపీట
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తొలి ఏకాదశి రోజున తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రైతులకు మేలు చేకూర్చేలా తయారు చేశారు. ఈ బడ్జెట్ రైతుల దిశ, దశను మార్చేస్తుందని అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ ఉండటాన్ని పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ మాది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నట్టే వారికి పంటల బీమాపై పూర్తి భరోసా ఇచ్చారు. వైఎస్సార్ పీఎం ఫసల్ ఉచిత పంటల బీమా పథకం కింద ప్రభుత్వమే చెల్లించేలా చేశారు. బడ్జెట్లో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ ఎన్నో రాయితీలు, ఉచితాలు ఇచ్చారు. ఉచిత పంటల బీమా పథకానికి ఏకంగా రూ.1,166 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వంలో చెల్లించని ఇన్‌ఫుట్ సబ్సిడీలు కూడా ఈ ప్రభుత్వమే చెల్లిస్తుందని భరోసా కల్పించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు వెంటనే రూ.7.50 లక్షల పరిహారం చెల్లించాలని సీఎం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా రూ.12,500 ఇస్తామని, ఈ మొత్తం కౌలు రైతులకు కూడా చెల్లిస్తామని ప్రకటించారు. ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్లతో ప్రత్యేక నిధి, రూ. 2వేల కోట్లతో ప్రక తి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశారు. ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి వైఎస్ జగన్ తాను రైతుల పక్షపాతి అని నిరూపించుకున్నారు.
తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిలానే రైతు సంక్షేమానికి పాటుపడే సంప్రదాయాన్ని చిత్తశుద్దితో కొనసాగించాలన్న తపన నవయువముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపించింది. రైతులను పట్టిపీడిస్తున్న సమస్యలేమిటో, ఎక్కడెక్కడ వారికి సమస్యలు ఎదురవుతున్నాయో, పాదయాత్రలో ఆయన ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌లోని మూడుప్రాంతాల్లో రైతుల కష్టాలు, వ్యవసాయరంగ సంక్షోభంపై స్పష్టమైన అవగాహన వున్న ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన పనిచేస్తున్నారు. ఇచ్చినమాట తప్పని వైయస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి…నాడు నేను ఉన్నాను అని ప్రజలకు ఇచ్చిన భరోసాను నిజం చేస్తున్నారు. రైతురాజ్యం…రాజన్న రాజ్యం సాకారమవుతుందన్న నమ్మకాన్ని ఇస్తున్నారు.
వేరుశెనగ విత్తనాలకు కొరత ఉందని తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన వేరే రాష్ట్రాల్లో కొనుగోలు చేయించి నెల్లాళ్లలోనే 3.57 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయడం, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని తెలిసి కొనుగోలుదారులతో మాట్లాడి ఒప్పించడం రైతులపట్ల జగన్‌కున్న చిత్తశుద్ధిని వెల్లడిస్తాయి. రౖౖెతుల రెక్కల కష్టంపైనే ఈ జాతి మనుగడ ఆధారపడి ఉంది. ఎన్నడో 1966లోనే విత్తన చట్టం వచ్చినా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పొలంలో పంట ఏపుగా కనబడుతున్నా దానికి పూత రాదు. కాపుగాసే జాడే కనబడదు. వందల రూపాయలు పోసి కొన్న విత్తనాల్లో సత్తువ లేదని గ్రహించేసరికల్లా పుణ్యకాలం గడిచిపోతుంది. అంతవరకూ ఆ పొలంపై ఎరువుల కోసం, పురుగుమందుల కోసం చేసిన వేల రూపాయల సొమ్మంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. రైతు దగాపడతాడు. ఇంటిల్లిపాదీ బావురుమంటారు. అప్పటికే అప్పు లపాలైన రైతుకు ఆత్మహత్య తప్ప మరే దారీ కనబడదు. ఈ దుస్థితిని పూర్తిగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. కల్తీ విత్తనాలు, నకిలీ ఎరువులు, పురుగు మందులను నిరోధించడానికి చర్యలు చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రయోగ శాలలు ఏర్పాటు చేసి నాణ్యతను నిర్ధారిస్తామని చెప్పారు. ఎరువులు, పురుగుమందుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే అవి లభ్యమయ్యేలా చేస్తామని తెలియ జేశారు.
ఈ ప్రయోగశాలలు ప్రారంభమైతే రైతులకెంతో మేలవుతుంది. బోగస్ పరిశోధనల పేరు చెప్పి, నాణ్యమైన సంకర జాతి విత్తనాలంటూ మాయదారి ప్రచారం చేసి సొమ్ము చేసుకుని రైతులను నిలువునా ముంచేయడం ఇకపై సాధ్యపడదు.
రైతుల కడగండ్లపై సంపూర్ణ అవగాహన ఉన్న నిపుణులు, శాస్త్రవేత్తలు, మంత్రులు, అధికారులతో అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేశారు. ప్రకతి సహకరిస్తుందో లేదో… పంట సరిగా పండుతుందో లేదో…పండాక గిట్టుబాటవుతుందో కాదో తెలియని అయోమయావస్థలో నిత్యం కష్టాల సేద్యం చేస్తున్నా, చినుకు పడి నేలంతా చిగురించాలన్న ఆశ, ధ్యాస తప్ప మరేమీ లేని రైతన్న రుణం తీర్చుకోలేనిది. అలాంటి రైతు కంట కన్నీరు రాకూడదని, అతడు ఎలాంటి ఇబ్బందులూ పడకూడదని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తపించేవారు. ఆయన వారసుడిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అఖండ మెజారిటీతో నెలరోజులక్రితం అధికార బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రైతు సంక్షేమానికి పాటుబడే సంప్రదాయాన్ని చిత్తశుద్ధితో కొనసాగిస్తున్నారు.













