ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని సీఎం జగన్ ఆదేశించారని ఆయన తెలిపారు. పరిస్థితులు పూర్తిగా అనుకూలించాక పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. లెక్క ప్రకారం జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ సీఎం జగన్ సమీక్షా సమావేశం తర్వాత వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. పరీక్షల సాధ్యాసాధ్యాలపై సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్, కేసుల తీవ్రత తదితర పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తేనే బాగుంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు కూడా ఇబ్బంది కలుగుతుందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో టెన్త్ పరీక్షలు వాయిదా వేస్తేనే బాగుంటుందని సీఎం జగన్ కూడా నిర్ణయించుకున్నారు. జూలైలో పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తామని, అప్పుడు నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖా మంత్రి సురేశ్ తెలిపారు. ఉన్నత చదువుల కోసం టెన్త్, ఇంటర్ ఫలితాలు చాలా కీలకమని, విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలని భావించామని పేర్కొన్నారు.
పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు ఉంటాయని, తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరమే లేదని మంత్రి భరోసా కల్పించారు. పరీక్షలు వాయిదా పడిన కారణంగా టీచర్లు కూడా పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు.