జస్టిస్ ఎన్.వి.రమణకు గౌరవ డాక్టరేట్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్ తెలిపారు. విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన ఆయనను డాక్టరేట్‌తో గౌరవించాలని వర్సిటీ నిర్ణయించగా.. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కులపతి హోదాలో గవర్నర్ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. ఈ నెల 20న వర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్ అందజేస్తామన్నారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్.వి. రమణను విశ్వవిద్యాలయం ఆహ్వానించింది. విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించిన మొదటి బ్యాచ్ విద్యార్థిగా ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం సముచితమంటూ ఈ అరుదైన అవకాశం వర్సిటీకి దక్కడంపై ఆచార్య రాజశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.













