Andhra Pradesh: ఏపీలో మరో సంక్షేమ కార్యక్రమం లైన్లో..?

తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమ కార్యక్రమాల విషయంలో తెలుగు ప్రజలు కాస్త ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. 2019 నుంచి ఇది మరింత ఎక్కువైంది అనే మాట వాస్తవం. 2019 ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఆ తర్వాత పసుపు కుంకుమ వంటివి ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఇక జగన్(YS Jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి, రైతు భరోసా, ఒంటరి మహిళలకు అందించే నిధులు ఇలా ఎన్నో రూపాల్లో ప్రజలకు ఉచితంగా డబ్బులు అందించాయి ప్రభుత్వాలు.
దీని కారణంగా ప్రభుత్వాలపై విమర్శలు వచ్చినా సరే.. ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేసిన సరే సంక్షేమ కార్యక్రమాల అమలు మాత్రం ఆగలేదు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాలు సవాలుగా మారనున్నాయి. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇప్పటికే తల్లికి వందనం(Talliki Vandanam) కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు త్వరలోనే అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా కొబ్బరికాయ కొట్టనున్నారు.
ఇక దానితో పాటుగా 18 ఏళ్లు దాటిన మహిళలకు 1500 ఇచ్చే కార్యక్రమానికి కూడా చంద్రబాబు నాయుడు సర్కార్ శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించి 3000 కోట్ల రూపాయలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమీకరించినట్లు సమాచారం. తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క బిడ్డకు 13వేల రూపాయలను జమ చేశారు. ఇక 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు త్వరలోనే నిధులు జమ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వరుస సంక్షేమ కార్యక్రమాలతో చంద్రబాబు సర్కార్ ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.