ఎపిలో మరో రికార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పించాలన్న నిర్ణయం మేరకు సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) వివిధ చోట్ల ఏర్పాటవడంతోపాటు తాము పరిశ్రమలు స్థాపించే ప్రాంతంలో స్థానికంగా ఉండే వారికే ఉపాధిని ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఉపాధి సౌకర్యాల కల్పనలో రాష్ట్రం రికార్డు సృష్టించింది. 2023-24లో ఎంఎస్ఎంఈల ద్వారా కనీసం 7.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా కేవలం ఐదు నెలల్లోనే లక్ష్యానికి చేరువ కావడం విశేషం. ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఎంఎస్ఎంఈల ద్వారా 7,01,975 మంది స్థానికులు కొత్తగా ఉపాధి పొందినట్లు కేంద్ర ఎంఎస్ఎంఈ పోర్టల్ ‘ఉద్యం’ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2022-23లో ఎంఎస్ఎంఈల ద్వారా 1,56,252 మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించుకోగా ఏకంగా 231 శాతం అదనంగా 3,61,172 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఇదిలా వుండగా ఎంఎస్ఎంఈ రంగంలో ఉపాధి కల్పనకు పరిశ్రమల శాఖ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించగా తొమ్మిది జిల్లాలు ఇప్పటికే లక్ష్యాన్ని దాటేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిత్తూరు, ఏలూరు, శ్రీసత్యసాయి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలు ఐదు నెలల్లోనే 100 శాతం లక్ష్యాన్ని అధిగమించాయి. చిత్తూరు జిల్లా లక్ష్యం కంటే ఇప్పటికే 317 శాతం, ఏలూరు 187 శాతం, శ్రీసత్యసాయి 151 శాతం సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఏడాది ‘ఉద్యం’ పోర్టల్లో కనీసం 1.50 లక్షల ఎంఎస్ఎంఈలను నమోదు చేయాలని నిర్దేశించుకోగా ఐదు నెలల్లోనే 97,378 యూనిట్లు కొత్తగా ఏర్పాటైనట్లు అధికారులు వెల్లడిరచారు. ఐదు జిల్లాలు 80 శాతానికిపైగా లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నాయి. కొత్త యూనిట్ల ఏర్పాటు లక్ష్యంలో ఏలూరు 91 శాతం, పశ్చిమ గోదావరి 84 శాతం, ప్రకాశం 81 శాతం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 80 శాతం, కర్నూలు 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి.













