ఆంధ్రప్రదేశ్ కు మరో అరుదైన ఘనత.. ఆసియా ఖండంలో పొడవైన సొరంగాలతో రికార్డ్
వెలిగొండ కల సాకారమైంది – రెండో టన్నెల్ పనులు పూర్తి
ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సర్కార్
ఏపీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగం పూర్తయ్యింది. వెలిగొండ ప్రాజెక్ట్ కల సాకారం చేస్తూ.. రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయని మేఘా సంస్థ తెలిపింది. పెద్దదోర్నాల మండలంలో చేపట్టిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణంలో.. మొదటి సొరంగం తవ్వకం పనులు గతంలో పూర్తవ్వగా.. రెండోది కూడా ఇప్పుడు పూర్తయ్యింది. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులు మంగళవారం పూర్తి చేసినట్టు ఇంజీనీర్లు ప్రకటించారు. ఇక, మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేయగా.. రెండో టన్నెల్ పనులు పూర్తి కావడంతో.. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ఘనత దక్కింది.
దుర్భిక్ష ప్రాంతా రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వైనం
శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ ఇప్పటికే పూర్తైంది. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమలసాగగర్ రిజర్వాయర్ మహానేత వైఎస్ హయాంలోనే పూర్తైంది. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమలసాగర్‌కు తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం జగన్ చర్యలు చేపట్టడంతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలు సాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు వైయస్ఆర్సీపీ శాశ్వత పరిష్కారం చూపగలిగింది.













