కాంగ్రెస్ గూటికి చేరిన మరొక వైసీపీ నేత..
ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఆంధ్రాలో అధికార పార్టీ వైసీపీ నుంచి వలసల పర్వం మాత్రం ఆగడం లేదు. లేటెస్ట్ గా మరో ఎమ్మెల్యే ఫ్యాన్ ను వీడి హస్తం లో చేరారు.ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఎలీజా.. ఈసారి ఎన్నికల్లో చింతలపూడి అభ్యర్థిగా కంభం విజయ రాజుని ప్రకటించడంతో వైసీపీ పై అసంతృప్తితో ఉన్నారు. అందుకే వైసీపీ నుంచి కాంగ్రెస్ కి తరలి వెళ్లారు. అయితే తమ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న చేరికలు ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్నదానికి సంకేతం అని వైఎస్ షర్మిల అన్నారు. ఇది ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణకు చిహ్నమని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవానికి జగన్ 175 అసెంబ్లీ స్థానాలకు, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సీట్లు రాని వాళ్ళు పార్టీపై అసంతృప్తితో నెక్స్ట్ ఆప్షన్స్ కోసం వెతుకుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడింది కాబట్టి ఆ పార్టీల నుంచి కూడా చాలామంది నేతలు టికెట్లు రాక నిరుత్సాహపడ్డారు. ఇప్పుడు వీరందరూ ఆశగా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హస్తం పార్టీలో చేరికలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి.













