Amaravathi: అమరావతికి తోడుగా మరో మహానగరం.. పెట్టుబడులకు ఆకర్షణగా గ్రేటర్ విజయవాడ..
అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణం ఒక దీర్ఘకాల ప్రక్రియ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సుమారు యాభై వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇంకా భూసేకరణ కొనసాగుతోంది. తుది స్థాయిలో ఎన్ని ఎకరాలకు పరిమితం అవుతుందో స్పష్టత లేదు. ఈ విస్తీర్ణంలో రాజధాని పూర్తిగా రూపుదిద్దుకోవాలంటే రహదారులు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు అవసరం. ఇవన్నీ అమలయ్యే వరకు ఎంత సమయం పడుతుందన్నది చెప్పడం కష్టం. అయినా అమరావతి ఏపీకి రాజధానిగా కళ్ల ముందే కనిపిస్తుండటం ప్రజలకు ఒక సంతృప్తిని ఇస్తోంది. మెల్లగా అయినా నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో అది ఒక భారీ నగరంగా మారడం ఖాయం అన్న అభిప్రాయం ఉంది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతికి పెద్ద ప్రాజెక్టులు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీ రంగం ఎక్కువగా విశాఖపట్నం (Visakhapatnam) వైపు కేంద్రీకృతమవుతుండగా, భారీ పరిశ్రమలు రాయలసీమ (Rayalaseema) ప్రాంతానికి వెళ్తున్నాయి. కియా (Kia) వంటి పరిశ్రమలు దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి చుట్టుపక్కల అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానంగా “గ్రేటర్ విజయవాడ” (Greater Vijayawada) అనే ఆలోచన ముందుకు వస్తోంది.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (Vijayawada Municipal Corporation) పరిధిని విస్తరించి గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (Kesineni Sivanath) ప్రతిపాదించారు. నగరానికి ప్రణాళికాబద్ధమైన, సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే గ్రేటర్ సిటీ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Gadde Rammohan)తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)ను అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
విజయవాడ పరిసర ప్రాంతాల్లోని 75 గ్రామాలను విలీనం చేస్తే పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, పర్యాటక పెట్టుబడులు పెరుగుతాయని ఆయన తెలిపారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు సానుకూలంగా ఉందన్న చర్చ జరుగుతోంది. అమరావతి పక్కనే రెడీమేడ్ మహానగరం ఉంటే పెట్టుబడిదారులు ముందుగా ఆ ప్రాంతానికే వస్తారని భావిస్తున్నారు.
ప్రస్తుతం విజయవాడ కార్పొరేషన్లో యాభై వార్డులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే గ్రేటర్ హోదా పొందిన విశాఖలో 99 వార్డులు ఉన్నాయి. మరో 75 గ్రామాలు కలిస్తే విజయవాడ వందకు పైగా వార్డులతో ఏపీలోనే అతిపెద్ద గ్రేటర్ సిటీగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అలా జరిగితే పరిశ్రమలు, వ్యాపారాలు విజయవాడ వైపే మొగ్గు చూపుతాయని, అమరావతి సిద్ధమయ్యేలోగా ఈ ప్రాంతం రాజధాని హోదాకు సమానమైన ప్రాధాన్యం పొందుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రతిపాదన ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందన్నదిపైనే ఉంది.






