బాలకృష్ణ జన్మదినం సందర్భంగా గుంటూరులో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూఎస్ఏ
నందమూరి బాలకృష్ణ 62వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులోని అన్ని డివిజన్లలో భారీ అన్నదానం చేయనున్నట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్-యూఎస్ఏ ప్రతినిధి ఉయ్యూరు శ్రీనివాస్ తెలిపారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ అభిమానులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ సేవా కార్యక్రమాలే తమకు స్ఫూర్తి అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని గుంటూరులో బాలకృష్ణ చేతులమీదుగా ఇప్పటికే అన్నక్యాంటీన్లు ప్రారంభించి అన్నదానం చేస్తున్నామని తెలిపారు. పేదలకు రూ.2కే బియ్యాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. వారిరువుర్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ నెల 10న గుంటూరులో 15 వేల మందికి అన్నదానం చేస్తామన్నారు.













