టీడీపీ విజయానికి ప్రవాసుల కృషి …
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రవాస భారతీయలమంతా గట్టి కృషి చేస్తామని టీడీపీ ఎన్ఆర్ఐ( అమెరికా) విభాగం సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి ఎలమంచిలి పట్టణంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. తొలిరోజు వ్యాన్‌లో భోజనాలు తీసుకొచ్చి వెయ్యి మందికి ఉచితంగా పెట్టారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ ఈ క్యాంటీన్ ద్వారా రోజూ 250 మందికి రూ.5 కే భోజనాలు అందిస్తామన్నారు. అమెరికా వెళ్లి 42 సంవత్సరాలు అవుతున్నా మాతృభూమిపై మమకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, టీడీపీ సీనియర్ నాయకులు లాలం భాస్కరరావులు మాట్లాడారు.













