మంత్రి ఉష శ్రీచరణ్ వ్యాఖ్యలకు నిరసనగా.. ఏపీలో
మంత్రి ఉష శ్రీచరణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ అంగన్వాడీ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళన చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు చీరల కోసం రూ.16 కోట్లు ఇచ్చామని, స్మార్ట్ఫోన్లకు రూ.85 కోట్లు వెచ్చించామని, రీఛార్జ్ల కోసం రూ.12 కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఉష శ్రీచరణ్ మీడియా సమావేశంలో చెప్పడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిని అంగన్వాడీలు నిర్బంధించారు. మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం వద్ద అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు. అనంతపురంలో మానవ హారంగా ఏర్పడి రోడ్డుపై బైఠాయించారు. 10 రోజులుగా ఆందోళన చేస్తుంటే ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు.













