తాము నొక్కే బటన్ తో రాష్ట్రంలో.. వైసీపీ అడ్రస్ లేకుండా
వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 21వ రోజు ఉద్ధృతంగా కొనసాగింది. ముఖ్యమంత్రి జగన్ తమ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలని, లేనిపక్షంలో మరో మూడు నెలల్లో తాము నొక్కే బటన్‌తో రాష్ట్రంలో వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందని అంగన్వాడీ కార్యకర్తలు వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కార్మికులు తమ సమ్మె శిబిరంలోనే కేక్ కట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ఇళ్లల్లో ఉండాల్సిన మమ్మల్ని ముఖ్యమంత్రి జగన్ ఇలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. మేము ఇంతలా అవస్థలు పడుతుంటే ఆయనకు మాపై కనికరం కలగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1.10 లక్షల మంది కార్యకర్తలు సమ్మెలో ఉంటే, ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చింది మీరు కాదా? మీ మాటలను నమ్మి ఓట్లు వేస్తే ఇలా అన్యాయం చేస్తారా? ప్రభుత్వం స్పందించి మా న్యామైన డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తాం అని తెలిపారు.













