ఏయూలో ఆస్ట్రేలియా సెంటర్ ను నెలకొల్పాలి : వీసీ ఆచార్య
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆస్ట్రేలియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని వీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి ఆస్ట్రేలియా కాన్సులేట్‌ను కోరారు. చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్ కార్యాలయ వైఎస్ కాన్సుల్ ఆండ్రూ కోలిస్టర్ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, వర్సిటీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆండ్రూ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో భారత్‌తో బలమైన బంధాన్ని ఆస్ట్రేలియా ఆశిస్తోందని అన్నారు. విద్య, ఇంక్యుబేషన్ తమకు ప్రధాన రంగాలుగా నిలుస్తాయన్నారు. ఇంక్యుబేషన్ విభాగంలో ఏయూతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇంక్యుబేషన్, మెరైన్ ఇంక్యుబేషన్ రంగాల్లో ఏయూతో కలిసి పనిచేస్తామన్నారు. వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ విద్య రంగంలో కలిసి పనిచేసేలా కలిసి రావాలన్నారు. ఇప్పటికే ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటవుతోందని తెలిపారు. అనంతరం ఆండ్రూను వర్సిటీ తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్, ఏయూ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో రవి ఈశ్వరపు తదితరులు పాల్గొన్నారు.













