ఏటి… యాక్షన్ లోకి దిగిపోనేటి..?
రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ రచ్చబండపై కూర్చున్న ఓ మహిళ ఫోన్ పట్టుకుని.. ఏటి.. యాక్షన్ లోకి దిగిపోనేటి.. సీఎం గారికి సెప్పనేటి.. అంటూ శ్రీకాకుళం యాసలో ఫైర్ అవుతున్న దృశ్యాలు పిచ్చపిచ్చగా వైరల్ అవుతున్నాయి. ఆ మహిళెవరూ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఆవిడ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ.
స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడ పిల్లలకు అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అయితే అది తను అనుకున్న విధంగా లేదు. సాంబార్, స్వీట్ సరిగా లేదని గ్రహించిన వాణీశ్రీ.. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నిప్పులు చెరిగారు. ఆ భోజనం ఏమాత్రం నాణ్యత లేదంటూ మండిపడ్డారు. రుచీపచీ లేని ఆహారం పిల్లలు ఎలా తింటారని ప్రశ్నించారు. మీ బాధ్యత లేదా అని నిలదీశారు.
పాఠశాలల్లో విద్యార్థుల భోజనానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంటే నాణ్యత లేని ఆహారాన్ని ఎందుకు ఇస్తున్నారని వాణిశ్రీ ఆగ్రహించారు. ఇలాంటి భోజనం మీ ఇంట్లో ఎవరైనా తింటారా అని నిలదీశారు. మూడ్రోజుల క్రితమే పిలిచి వార్నింగ్ ఇచ్చానన్న ఆమె.. అయినా తీరు మార్చుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ వెళ్తున్నానని.. సీఎం దృష్టికి తీసుకెళ్లి మీ భరతం పడతానని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయనని.. యాక్షన్ లోకి దిగిపోతానని వార్నింగ్ ఇచ్చారు.
వాణీశ్రీ ఇటీవలే సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆముదాలవలస నియోజకవర్గంలోని తొగరం గ్రామానికి ఆమె సర్పంచ్. అప్పటి నుంచి గ్రామంలో విస్తృతంగా తిరుగుతున్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించినప్పుడు ఆమెకు నాసిరకం భోజనం అందుతుందడాన్ని గమనించి అధికారులపై పైర్ అయ్యారు. ఆమె ఫోన్ లో మాట్లాడిన తీరు.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.













