APNRT: ఏపీలో ప్రవాసాంధ్రులు.. ఎంతమంది ఉన్నారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర దేశాల్లో 1,70,509 మంది ప్రవాసాంధ్రులు ఉన్నట్లు గ్రామ (Village) , వార్డు(ward) సచివాలయాల శాఖ సర్వేలో వెల్లడైంది. ప్రవాసాంధ్రులకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు అలాంటివారు ఎంతమంది ఉన్నారో తేల్చాలన్న ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) (APNRT) విజ్ఞపిపై సచివాలయాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఇంటింటి సర్వే చేయించింది. 14,999 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1,68,36,434 ఇళ్లకు వెళ్లి సర్వే చేశారు. ఇందులో 1,11,909 ఇళ్లలో 1,70,509 ప్రవాసాంధ్రులు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఉద్యోగ (Job) , ఉపాధి, ఉన్నత విద్యాభ్యాసం (Education) కోసం వేర్వేరు దేశాల్లో ఉంటున్నట్లు వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తేల్చారు.
అయితే తమవారు ఏయే దేశాల్లో ఉన్నారో చెప్పేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపలేదు. అత్యధికంగా అన్నమయ్య జిల్లా (Annamaya District )లో 17,980 మంది ప్రవాసాంధ్రులు ఉన్నట్లు గుర్తించారు. వీరు గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పశ్చిమ గోదావరిలో 15,471, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 15,378 మంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. వీరంతా ఉపాధి కోసం వెళ్లినవారని అంచనా వేస్తున్నారు.













