అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు 30 రోజుల పాలన తీరు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి అఖండ విజయం సాధించిన తరువాత టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి అధికారం చేపట్టి నేటికి నెల రోజులు పూర్తయ్యింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెలరోజుల పాలనపై అందరూ చెబుతున్నదేమిటంటే అభివృద్ధివైపు ఎపి పయనిస్తోందని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 30 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం 100 అడుగులు వేసింది. తొలి నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలో నడిపించేందుకు అడుగులు పడ్డాయి. ఐదేళ్లలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించి క్షణం విశ్రమించకుండా అవవిశ్రాంత పోరాటాన్ని చేస్తున్నారు.
సీబీఎన్ 4.0 లో దూకుడుగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటూ అధికారమంటే పదవి కాదు, బాధ్యత అని చాటే విధంగా పరిపాలనలో తనదైన శైలిలో పాలనను సాగిస్తున్నారు. కేవలం నెల రోజుల పాలనలోనే తనదైన ముద్రను చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరైన మార్గంలో పెడుతున్నారు. ప్రజా ప్రభుత్వమన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తూ, గతంలో ఉన్న పరిస్థితులను మారుస్తున్నారు. తన అనుభవాన్ని రంగరించి ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తూ ప్రభుత్వంపై ఒక భరోసాను కల్పిస్తూ, దారి తప్పిన వ్యవస్థల ప్రక్షాళన మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఎక్కడా అశాంతికి, అధికార అహంకారానికి, అకృత్యాలకు, హంగామా, హడావుడి లేకుండా సింపుల్ గవర్నర్మెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ సాగేలా చంద్రబాబు అనేక మార్పులు చేస్తున్నారు. గతంలో మాదిరిగా పరదాలు, బారికేడ్లు, చెట్ల నరికివేత లేకుండా ప్రజలతో ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తున్నట్లుగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా అమలు టైటిల్ యాక్ట్ రద్దు ఫైల్‌పై సంతకం చేసి గందరగోళానికి చెక్ పెట్టారు. అవ్వతాతల పెన్షన్‌ను ఒక్కసారిగా రూ.1000 పెంచి బకాయిలతో కలిపి చెల్లించారు. అవ్వతాతలకు, వికాలాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసాను కల్పించారు. ఇక అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, న్కెపుణ్య గణనపై సంతకాలు చేసి మంత్రివర్గ ఆమోదాన్ని కూడా తీసుకున్నారు. తొలి నెలలోనే రూ.4408 కోట్ల నగదును పించన్ల పంపిణీ రూపంలో చేసి సంక్షేమ పండగకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15న 183 అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక రైతుల పాస్ పుస్తకాలపై గతంలో ఉన్న జగన్ ఫోటోలను తొలగించి, ప్రభుత్వ రాజముద్రతోనే పాస్ పుస్తకాలు అందించేందుకు ఆదేశాలు ఇచ్చారు. నాలుగోసారి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టాక తొలి వారంలోనే పోలవరంలో తొలి పర్యటనకు శ్రీకారం చుట్టి ఆంధ్రుల రాజధాని అమరావతిలో రెండో పర్యటనను చేపట్టి ఆ ప్రాజెక్టులపై తనకున్న చిత్తశుద్ధిని, అనుబంధాన్ని స్పష్టం చేశారు. ఇంకోవైపు ప్రభుత్వ ఖజానాపై ఖర్చుల భారం లేకుండా సింపుల్ గవర్నెన్స్ సాగిస్తూ రచ్చబండ సభలకు శ్రీకారం చుట్టారు. గతంలో వైసీపీ తొలగించిన పెన్షన్లను పురుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. మచిలీపట్నంకు చెందిన దివ్యాంగురాలు సీమా పర్వీన్‌కు గతంలో పెనన్ష్ను నిలుపుదల చేయడంపై నాడు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టాక సీమా పర్వీన్‌కు అందించారు. ఇక కాకినాడ ఆరుద్రకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు నెలకు రూ.15 వేల పెనన్ష్ను మంజూరు చేసి బాధితులకు అండగా నిలిచారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి శుభ సంకేతాలు రావడం మొదలైంది. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి అవసరమైన బలాన్ని సమకూర్చడంలో టీడీపీ పాత్ర ప్రముఖంగా ఉండటం కారణం. చంద్రబాబు మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా హాజరై టీడీపీ ప్రాముఖ్యతను చాటారు. పాలనాపగ్గాలు చేపట్టిన తొలి నెలలోనే ఢల్లీికి వెళ్లిన చంద్రబాబు, ప్రధాని సహా ఎనిమిది మంది మంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పథకాలపై వినతులను ఇచ్చి వచ్చారు. దీని ఫలితాలు వేగంగా కనిపించాయి. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు భూ సమీకరణతో సహా మొత్తం వ్యయాన్ని భరించడానికి కేంద్రం ముందుకు వచ్చింది. రూ. అరవై వేల కోట్ల వ్యయంతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుపై చర్చించడానికి బీపీసీఎల్ కంపెనీ సీఎండీతోపాటు ముఖ్య అధికారగణం తరలివచ్చింది. ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. ఐదు వేల కోట్ల వరకూ మంజూరుకు కేంద్రం అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి వ్యయం అయ్యే రూ. వెయ్యి కోట్లు కేంద్రం భరించేలా రాష్ట్రం ఒప్పించగలిగింది. జీఎస్టీ వాటా నిధులు తెలంగాణకు రూ. 2200 కోట్లు విడుదల అయితే ఏపీకి రూ. నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అందాయని చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం సహకరించగలదని రాష్ట్రం ఆశిస్తోంది. అధికారికంగా చెప్పకపోయినా వివిధ పథకాల రూపంలో కేంద్రం నుంచి కొంత అదనపు సాయం రాబట్టగలమని టీడీపీ ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ఇదే సమయంలో వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల దృష్టికి తేవడానికి కూడా టీడీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోంది. కీలకమైన రంగాల్లో ఏం నష్టం జరిగిందో శ్వేత పత్రాల రూపంలో ప్రజల ముందుకు తెస్తున్నారు. ఇప్పటికి మూడు పత్రాలను విడుదల చేశారు.
సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ పరిపాలన ఉండాలన్న నివాదంతో సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తూ ముందుకు సాగుతున్నారు. గత ఐదేళ్లుగా గాడి తప్పిన శాంతి భద్రతలను మళ్లీ పటిష్టంగా అమలు చేసేందుకు సీరియస్‌గా దృష్టి పెట్టారు. బాపట్ల జిల్లాలో జరిగిన దారుణ ఘటనపై ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి 48 గంటల్లోనే నిందితులను కటకటాల వెనక్కి నెట్టే ఆదేశాలు ఇచ్చారు. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ కర్మాగారంలో జరిగిన పేలుళ్లలో మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించి మానవత్వాన్ని చాటుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు తొలి అడుగు వేశారు. ఆయనే చొరవ తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా లేఖ రాసి చర్చలు జరిపారు. ఇప్పటివరకు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు చంద్రబాబు ఊరట కల్పించారు. నిర్మాణ రంగానికి కార్మికులకు మేలు చేకూర్చేలా అన్నమాట ప్రకారం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. కొత్త పాలసీని రూపొందించి లోడిరగ్ ఛార్జీలతోనే ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ పెట్టుబడుల వరద ప్రారంభమైంది. చంద్రబాబు పరిపాలనపై ఉన్న నమ్మకం ఆయన అనుభవంపై విశ్వాసం ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు మళ్లీ ఏపీ వైపు చూస్తున్నారు. ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు హామినిచ్చిన కూటమి ఆ దిశగా అడుగులు వేస్తోంది. పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తూ వేల కోట్ల పెట్టుబడులను రాబట్టే పనిలో నిమ గ్నమయ్యారు. తాజాగా బీపీసీఎల్ రూ.60 వేల కోట్లతో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయగా విన్‌ఫాస్ట్ ఆటోమొబ్కెల్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముదుకు వచ్చింది. రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పారిశ్రామికవేత్తల నుంచి స్పందన కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చేయ భోగాపురం ఎయిర్‌పోర్టుపై కూడడా సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. 2026 నాటికి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సమీక్షలు నిర్వహిస్తూ స్పష్టమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అన్ని శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షలు చేపట్టారు. వైద్యం, తాగునీరు, రోడ్లు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖలపై మంత్రులు, అధికారులతో నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ పనులు మొదలెయ్యిలా ఆదేశాలిచ్చారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటున్నారు. పార్టీ కోసం అహర్శిశలు శ్రమించిన కేడర్‌లో కొత్త భరోసాను నింపుతున్నారు. గతానికి భిన్నంగా కార్యకర్తలు, క్రిందిస్థాయి నేతలకు అగ్రప్రాధాన్యతనిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ప్రతి శనివారం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సందర్శకులను, కేడర్‌ను కలుస్తూ గంటల కొద్ది సమయాన్ని వారికి వెచ్చిస్తున్నారు. పార్టీ విజయంలో అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు తగిన గుర్తింపునిచ్చేందుకు నామినేటెడ్ పదవులపైనా కసరత్తును మొదలు పెట్టారు. ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో చంద్రబాబు సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు. బీసీలకు అత్యంత గౌరవం ఇస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు స్పీకర్ పదవిని బీసీ వర్గాలకు కేటాయించారు.
శాఖల వారీగా చూస్తే.. నారా లోకేష్, పవన్ కల్యాణ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత తప్పితే మరెవ్వరూ చురుగ్గా కనిపించట్లేదన్నది చె. మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం అయితేనేం.. శాఖల్లో పనితనం చూపించిన తీరు.. ఇవన్నీ బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయా శాఖల్లో మార్క్ చూపించుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక కొందరు మంత్రి పదవులను అడ్డుపెట్టుకుని ఇప్పటికే చేయాల్సిన పనులు చేస్తున్నారని ఈ క్రమంలో చంద్రబాబు నుంచి వార్నింగ్‌లు కూడా వెళ్లాయనే టాక్ గట్టిగానే నడుస్తోంది. ఆ మధ్య భర్త మంత్రి కావడంతో ఆయన సతీమణి చేసిన పోలీసులతో చేసిన ఓవరాక్షన్ అందరూ చూసే ఉంటాం. ఇలాంటి ఒకట్రెండు ఘటనలతో ప్రభుత్వానికి మాయని మచ్చ అవకాశం చాలా ఉంది.
మొత్తం మీద చంద్రబాబు నెలరోజులపాలన తీరు చూస్తే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరిగినట్లే కనిపిస్తోంది. చంద్రబాబు రాకతో పెట్టుబడులు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందరూ భావిస్తున్నారు.













