జల పర్యాటకంపై ఎపి ప్రభుత్వం దృష్టి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు జలరవాణా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం బోటింగ్ టూరిజాన్ని మెరుగుపరుస్తూనే కొత్త జలవనరుల అన్వేషణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సంయుక్తంగా పనిచేయనున్నాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక టాస్క్ఫోర్సు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా నీటివనరులు, బీచ్‌లను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తిస్తుంది. రాజమహేంద్రవరం, విజయవాడ, నాగార్జునసాగర్, శ్రీశైలంలో పర్యాటకశాఖ ఎక్కువగా బోటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లోను అంతర్గత బోట్ల సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ బోటింగ్ రక్షణకు పెద్దపీట వేయనుంది. మరోవైపు చిన్నచిన్న బోట్ల దగ్గర నుంచి హౌస్ బోట్లు, క్రూయిజ్లను సైతం నడిపేలా, తీర్థస్థలాలు, వారసత్వ ప్రదేశాలను కలుపుతూ ఉండే నదీమార్గాలను అన్వేషిస్తోంది. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఏపీలో బీచ్‌లను ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనుంది.
ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీకి ఏపీటీడీసీ ఎండీ చైర్మన్‌గా, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ ఈడీ కో చైర్మన్‌గా, ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీ టూరిజం అథారిటీ డిప్యూటీ సీఈవో, ఏపీటీడీసీ ఈడీ (ప్రాజెక్ట్స్), జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్, దేవదాయశాఖ జాయింట్ కమిషనర్, ఏపీటీడీసీ వాటర్ ఫ్లీట్ జీఎంలతో పాటు ఏపీటీడీసీ, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ నుంచి ఒక్కో నామినేటెడ్ వ్యక్తి ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాలతో పాటు బెల్జియం, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో పర్యటించి అక్కడి జల పర్యాటకం, రవాణా సౌకర్యాలను పరిశీలిస్తుంది. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తుంది.













