ఏపీలో ముగిసిన రెండో దశ పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. రెండో దశ పోలింగ్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో పోలింగ్ జరిగింది. వాటిలో 2,786 సర్పంచ్ స్థానాలు, 20,817 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. పలుచోట్ల టీడీపీ, వైకాపా వర్గీయులు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అలాంటి చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ కొనసాగింది. మొదటి దశలో మాదిరిగానే రెండో దశలోనూ ఓటర్లు ఓటు వేసేందుకు పోటెత్తారు.
రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 167 మండలాల పరిధిలోని 3,328 గ్రామ పంచాయతీల్లో రెండో దశ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో అన్ని జిల్లాల్లో కలిపి 539 పంచాయతీలు ఏకగ్రీవాలు అయినట్లు ఎస్ఈసీ వెల్లడించారు. ఏకగ్రీవాలు పోగా మిగతా 2,786 పంచాయతీల్లో పోలింగ్ జరిగింది.













