ఏపీ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,060 గ్రామ పంచాయితీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన సమీక్షలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ గతంలో 60 శాతం రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. ప్రస్తుతం 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశించిందని తెలిపారు. రిజర్వేషన్లపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి దశలో గ్రామ పంచాయతీలకు, రెండో దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడోదశలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. బ్యాలెట్ విధానంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఈవీఎంలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని సృష్టం చేశారు. మున్సిపాలిటీల్లో విలీనానికి సంబంధించి వివాదాలపై ఆ శాఖే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.













