ఎపిలో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన తరువాత నోటిఫికేషన్ జారీ చేశారు. 1974 ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. పరిపాలనా సౌలభ్యం.. ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సహా పలు సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక అడుగు ముందుకేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తూ పునర్వ్యవస్థీకరణకు నడుం బిగించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో గతంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసుల మేరకు 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి జగన్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజలు, ప్రజాసంఘాల నుంచి ఫిబ్రవరి 26 వరకు అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయం మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి అంటే ఏప్రిల్ 2వతేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పాలనా సౌలభ్యం, సత్వర సేవల కోసం లోక్‌సభ నియోజక వర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని గతంలో ప్రణాళిక సంఘం సిఫార్సు చేసింది. ఇదే ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలు జిల్లాలను పునర్వ్యవస్థీకరించాయి. తెలంగాణ రాష్ట్రం కూడా జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సుదీర్ఘ కసరత్తు చేసింది. ఈలోపు 2021 జనాభా గణన అంశం ముందుకు రావడంతో కొంత ఆలస్యమైంది. కరోనా వల్ల ఇప్పటికీ జనాభా గణన ప్రారంభం కాలేదు. అది ప్రారంభమయ్యేలోగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త జిల్లాలకు ప్రముఖుల పేర్లు
మన్యం విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటం జరిపిన ప్రాంతాన్ని ఆయన పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. దాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు పాడేరు కేంద్రంగా అరకు ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేశారు. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను కొనసాగించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం ప్రత్యేకతను తెలియజెప్పేలా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి, అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించింది ప్రభుత్వం. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం దెబ్బ తినకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పునర్వ్యస్థీకరించింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, నర్సాపురం పార్లమెంటును భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి వాటి ప్రాధాన్యతను కొనసాగించింది. ఈ జిల్లాలు గోదావరి తీర ప్రాంతాలు.
ఎన్టీఆర్ జన్మించిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చాలాకాలం నుంచి ఉన్నా ఆచరణలోకి రాలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకుంటూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇది మంచి నిర్ణయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు మచిలీప్రట్నాన్ని కృష్ణా జిల్లాగా కొనసాగిస్తూ దాని చారిత్రక ప్రాధాన్యతను ప్రభుత్వం నిలబెట్టింది. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ప్రత్యేకతను నిలబెడుతూ ప్రత్యేక జిల్లా చేయాలని అనేక ఉద్యమాలు జరిగాయి. ఇప్పటివరకు ఎవరూ అక్కడి ప్రజల డిమాండ్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించేలా నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బాపట్లను జిల్లాగా చేయాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది. ఆ కల ఇప్పుడు నెరవేరింది. పుట్టపర్తి ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన సత్య సాయిబాబాను స్మరిస్తూ శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసింది. తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా ఏర్పాటు ద్వారా ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించింది. తిరుపతి వేంకటేశ్వరస్వామిని స్మరించేలా బాలాజీ జిల్లా ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా హర్తం వ్యక్తమవుతోంది. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య నడయాడిన ప్రాంతం రాయచోటి. ఆ ప్రాంతాన్ని అన్నమయ్య పేరుతోటే అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసి ఆయన కీర్తిని మరింతగా ఇనుమడిరపజేసింది.
ఇలా జిల్లాల ఏర్పాటులో ప్రముఖుల పేర్లను పెడుతూ, కొన్ని ప్రాంతాలను మార్చుతూ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.













