సీఎం జగన్ సహా 41 మందికి హైకోర్టు నోటీసులు
ఆంధప్రదేశ్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మాటున ఆర్థిక అవకతవలు జరుగుతున్నాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని రఘురామ తన పిటిషన్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్ వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వివరించారు. మరోవైపు పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.













