8 జిల్లాల్లో కర్ఫ్యూను సడలించిన ఏపీ ప్రభుత్వం

కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సడలింపులకు శ్రీకారం చుట్టింది. మొత్తం 8 జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలను సడలిస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ 8 జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగానే ఉంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కర్ఫ్యూను సడలించాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ కర్ఫ్యూను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ ఎప్పటిలాగే కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయనగరం, విశాఖ, కడప, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలు కర్ఫ్యూ సడలించిన జాబితాలో ఉన్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకే కర్ఫ్యూ సడలింపులు ఉంటాయి. ఆ తర్వాత కర్ఫ్యూ అమలులోనే ఉంటుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు ఈ ప్రాంతాల్లో 5 శాతం కన్నా ఎక్కువగా ఉందని, అందుకే కర్ఫ్యూను యథావిథిగా కొనసాగిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.