పక్క రాష్ట్రాల మద్యానికి ఏపీలో నో ఎంట్రీ
ఏ రకంగానూ మందుబాబులకు ఉపశమనం కలిగించే ఏ రకమైన ఉద్ధేశ్యం తమకు లేదని ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్పష్టం చేసింది. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కొన్ని నెలల క్రితం దాఖలైన పిటిషన్పై రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం విచారణ జరిపిన సంగతి, విచారణ అనంతరం మందుబాబులకు కాస్త ఉపశమనం కలిగించేలా ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పు సంగతి ఎలా ఉన్నా… పక్క రాష్ట్రాల నుంచి ఇకపై మద్యం తీసుకొచ్చేందుకు వీల్లేదని సోమవారం జారీ అయిన ప్రభుత్వ జీవో స్పష్టం చేసింది. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఏపీలో ఇప్పటికే బెల్ట్ షాపులు రద్దు చేయడంతో పాటు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెంచడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ఏపీలోకి ప్రవహిస్తోంది. అనేకమంది ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేసుకొని ఏపీలో విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇలాంటి వారికి హైకోర్టు తీర్పు మరింత ఊతంగా మారింది. దీంతో ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
ఆ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడంపై నిషేధం విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీల్లేదని అలా తెచ్చుకోవాలనుకున్నవారు తగినన్ని పన్నులు చెల్లించి మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు తీర్పు ప్రకారం.. పక్క రాష్ట్రాల నుంచి వ్యక్తిగత వినియోగం కోసం మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు కూడా ఇకపై అనుమతి లేదని తేల్చి చెప్పంది. పన్నులు చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులని హెచ్చరించింది. ఈ ఆదేశాలతో జీవో నెంబర్ 310ను ఎక్సైజ్ శాఖ సోమవారం విడుదల చేసింది. మరోవైపు విదేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతిస్తామని తెలియజేసింది. అయితే హైకోర్టు తీర్పుకు విఘాతం కలిగించేలా ఉన్న ఈ ఉత్తర్వులపై భవిష్యత్తులో న్యాయవివాదాలు చెలరేగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.













