బ్లాక్ ఫంగస్ పై ఏపీ సర్కార్… కీలక నిర్ణయం

ఇప్పటికే కరోనా చికిత్సకు ఆరోగ్యశ్రీ పథకం కింద అందిస్తున్న ఆంధప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం కొందరిలో బయటపడుతున్న బ్లాక్ ఫంగస్ కేసులకు చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొద్దిరోజుల కిందటే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్‍కు చికిత్స చేయాలన్నారు. అలాగే, బ్లాక్ ఫంగస్ చికిత్సను అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవోకు సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు.
విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్ రోగుల చికిత్సకు కేజీహెచ్‍లో పడకలు ఏర్పాటు చేశారు. డెర్మటాలజీ విభాగంలో 20 పడకలను కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో క్లినికల్ మేనేజ్‍మెంట్ ప్రొటోకాల్ కమిటీని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి. ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.