రాష్ట్రపతితో గవర్నరు విశ్వభూషణ్ హరిచందన్ భేటీ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, గవర్నరు విభిన్న సమకాలీన రాజకీయ అంశాలపై కొద్ది సేపు చర్చించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో ఆమెకు గవర్నరు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆదివాసీ గిరిజన మహిళ దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా తమ పదవీ కాలంలో బాధ్యతలు సక్రమంగా నిర్వహించి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారనే ఆశాభావాన్ని గవర్నరు వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, గవర్నరు ఒడిశాకు చెందినవారే కావడం విశేషం. వీరిద్దరూ చాలా ఏళ్లు తర్వాత కలిసినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.













